గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/ఆంగ్ల పదాల రూపకల్పనలో వాడిన పద్ధతులు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

కొందరు తలపోస్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకు కనిపించే పదాలు ఇతర భాషల నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు. ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడ్డవీ కావు. వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది. అలాంటి కృషినే ఇప్పుడు మనం కూడా చెయ్యాలనుకుంటున్నాం. కొత్త పదాల రూపకల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు మేధావులు అనుసరించిన పద్ధతుల్నే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

పోలిక (Analogy)

అంతకుముందున్న పదాలకు సంబంధించిన కొత్త పదాలు అవసరమైనప్పుడు ఆ పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులూ చేర్పులూ చేసి వేరే అర్థంలో వాడారు. అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny అనే పదాన్ని కల్పించారు. అంతకుముందు gnostic (ఒక ప్రాచీన క్రైస్తవ శాఖ సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజ్ఞేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని కల్పించారు. outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్ పదం కాగా దానికి విశేషణంగా outrageous అని లాటిన్ శైలిలో కల్పించారు. అంటే ఉన్న పదాల నుండే కొత్త పదాల్ని కల్పించారు. అలా కల్పించడం ఇంగ్లీషు/లాటిన్ వ్యాకరణ సూత్రాలకు విరుద్ధమైనా లెక్కచెయ్యలేదు. సూత్రాలు వర్తింప శక్యమైతే పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట త్రోసిపుచ్చారు.

ధ్వన్యనుకరణ (Imitation)

మనుషులు భావోద్వేగపు క్షణాల్లో చేసే అవ్యక్త కాకుస్వరాలకూ ధ్వనులకూ శబ్ద ప్రతిపత్తిని కల్పించారు. ఆ ధ్వనులకు తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు. ఆ క్రమంలో lispism, yahoo, pooh-poohing, booing మొదలైన పదాలు పుట్టాయి. మనవాళ్ళు కూడా "చకచక, నిగనిగ" నుంచి చాకచక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన పదాల్ని నిష్పాదించారు. అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.

అర్థాంతర ప్రకల్పన (Semantic alteration)

సాధారణ పరిస్థితుల్లో భాష చనిపోదు. ఇసుమంత మారుతుందంతే ! ఇంగ్లీషువారు అంతకుముందున్న పదాలకే కొత్త అర్థాల్ని అనువర్తించారు. fan, straw, (cheque)leaf, web, portal మొదలైనవి ఈ కోవకు చెందినవి. కాని ఇలా చెయ్యాలంటే భాషా పటిమ కన్నా మనిషిలో కొంత కవితాత్మకత తోడవ్వాలి.

పునరుద్ధరణ (Revival)

భాషలో కొన్ని పదాలు బహు పాతవై ఉంటాయి. అవి నిఘంటువులకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అవి ఇప్పుడెవరూ ఏ మాండలికంలోను వాడకపోవచ్చు. వాటికి సమానార్థకాలైన వేరే పర్యాయపదాలు ఇప్పుడు లభ్యమౌతూ ఉండొచ్చు. అంతమాత్రాన ఆ పాత పదాలు పనికిమాలినవి కావు. ఈ సత్యాన్ని ఇంగ్లీషువారు లెస్సగా కనిపెట్టారు. ఆ పదాల పాత అర్థాలకి సరిపోలిన కొత్త అర్థాల్లో వాటిని వాడడం మొదలుపెట్టారు. ఆధునికంగా లభ్యమౌతున్న పదాలకు తోడు ఈ పాత పదాలు కొత్త అర్థాల సోయగాలతో జతచేరి ఇంగ్లీషు భాషని నవయౌవనంతో పరిపుష్టం చేశాయి. olympics, carnival, domain మొదలైనవి ఇందుకు ఉదాహరణ.

మాండలికాల విస్తృత వినియోగం (universalization of dialects)

ఇంగ్లీషులో ఎన్ని మాండలికాలున్నాయో ఎవరికీ అంతు చిక్కదు. అయితే ఇంగ్లీషువారు ఆ మాండలికాలన్నింటినీ సందర్భానుసారంగా ఉపయోగించుకుని భాషని శక్తిమంతం చేసుకున్నారు. మాండలిక పదాలకు ఇప్పటికే ఉన్న అర్థాలకి తోడు కొత్త అర్థాల్ని జతకలిపారు. కొన్ని సందర్భాల్లో Slang నుండి సైతం ప్రామాణిక భాషని సిద్ధం చేశారు. ఉదాహరణకి jazz అనే పదం New Orleans లో ఒక పచ్చి అశ్లీల క్రియాధాతువుగా మాత్రమే వాడుకలో ఉండేది. అదిప్పుడు ఒక గౌరవనీయమైన సంగీత కళారూపానికి నామధేయమైంది.

మిశ్ర పద నిష్పాదన (hybrid coinage)

ఇంగ్లీషులో ఇప్పుడు "చెయ్యదగిన" అనే అర్థంలో క్రియాధాతువుల చివర చేర్చబడుతున్న able అనేది నిజానికి ఫ్రెంచి ప్రత్యయం. మొదట్లో ఇది adorable మొదలైన ఫ్రెంచి ఆదాన పదాలకు మాత్రమే చేరేది. క్రమంగా దాన్ని దేశి ఇంగ్లీషు పదాలక్కూడా యథేచ్ఛగా చేర్చడం మొదలైంది. ఈరోజు think, drink, eat, walk లాంటి అచ్చ ఇంగ్లీషు పదాలక్కూడా ఈ విధమైన పరిణామాన్ని చూస్తున్నాం.

మన సంప్రదాయంలో సంస్కృత పదాలతో జతకలిపి తెలుగుతో సహా ఏ ఇతర భాషాపదాలకైనా సరే సంధులూ, సమాసాలూ చెయ్యడం ఆదినుండి నిషిద్ధం. కలిసే అవయవాలు రెండూ సంస్కృత పదాలైతేనే సంధిసమాసాలు సాధ్యం. ఆ రకంగా అవసరం లేని సంస్కృత పదాలు కూడా తెలుగులోకి సమాసాల రూపంలో యథేచ్ఛగా చొఱబడిపోయాయి. ఒకప్పుడు ఇంగ్లీషులో కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది. లాటిన్ గ్రీకు పదాలతో అచ్చ ఇంగ్లీషు పదాల్ని కలపకూడదు. అంతే కాక లాటిన్ సమాసాలు లాటిన్తో జరగాలి. గ్రీకు సమాసాలు గ్రీకుతోనే జరగాలి. లాటిన్ పదాలతో గ్రీకు పదాల్ని కలపకూడదు.

కాని ఆధునిక ఇంగ్లీషు మేధావులు ఈ సంప్రదాయాన్ని కావాలనే విశృంఖలంగా ఉల్లంఘించారు. తప్పలేదు, తప్పు లేదు. ఎందుకంటే సమాసంలో రెండో పదం కూడా ఆ భాషాపదమే అయివుండాలంటే, ఎంతమందికి లాటిన్ గ్రీకుల మీద పట్టుంటుంది ? అలా పదసృష్టి ఆగిపోతుంది.

నామవాచకాల క్రియాకరణం (Verbification of nouns)

ఆధునిక ఇంగ్లీషు అన్ని రంగాల్లోను వాయువేగ మనోవేగాలతో దూసుకుపోవడానికి ఈ చర్య దోహదించినంతగా మఱింకేదీ దోహదించి ఉండలేదు. ఈనాటి ఇంగ్లీషులో ఏ (noun) నామవాచకాన్నయినా సరే, క్రియాధాతువు(verb-root)గా మార్చి వాడుకునే సౌలభ్యముంది. అసలు అవి మౌలికంగా క్రియలా ? నామవాచకాలా ? అని సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడేటంతగా ఈ ప్రక్రియ విశ్వవ్యాప్తమైంది. ఆఖరికి పొడిపదాల్ని కూడా క్రియలుగా మార్చేసి SMSing అని వాడుతున్నారు.

వ్యక్తినామాల (proper nouns)ని సైతం క్రియలుగా మార్చేశారు. Charles F. Boycott అనే బ్రిటిష్ భూస్వామి అడిగినంత కూలీ ఇవ్వట్లేదని ఆయన ఎస్టేట్లో పనిచేసే రైతుకూలీలంతా సమ్మెచేసి పనులకి దూరంగా ఉంటే, దానికి boycotting అని పేరొచ్చింది. ఇలాంటివి మన తెలుగులో కూడా ఒకటి-రెండు లేకపోలేదు. ఉదా:- భీష్మించడం. ఈ క్రియ తెలుగులోనే ఉంది కానీ సంస్కృతంలో లేదు.

సమాస ఘటనం

ఇంగ్లీషు మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశపెట్టారు. వాడుకలో బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ ఇంగ్లీషు వ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ సముచిత స్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేరు వేరు అర్థాలు గల పదాలతో ఏర్పడే మిశ్రమం. ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్తపదం ఒక కొత్త అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది. ఉదా :- రాజ భవనం. ఇది రాజు కంటే, భవనం కంటే వేరైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది. సమాసాల సౌలభ్యాన్ని ఇంగ్లీషు మేధావులు త్వరగానే గ్రహించారు. ఇప్పుడు సమాసాలు లేకుండా ఇంగ్లీషు మాట్లాడ్డమే అసాధ్యం. ఒకవేళ అలా మాట్లాడితే ఇంగ్లీషు రాదేమో నని జాలిపడడం కూడా జరగొచ్చు.

 1. Customer-care = care for customers
 2. User-friendly = friendly to the user
 3. User-serviceable = serviceable by the user
 4. Gas dealer = Dealer in gas
 5. Expiry date = date of expiry
 6. God-forsaken = forsaken by God
 7. Bible-thumping = thumping the Bible
 8. A London-bound airliner = An airliner bound to London
 9. Earth-fill = Filling with earth
 10. sky-diving = diving in the sky
 11. trustworthy = worthy of trust
 12. action-packed = packed with action
 13. painstaking/breathtaking etc.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. తాము వాడుతున్నవి సమాసాలు (word compounds) అని ఇంగ్లీషువాళ్ళకు ఇప్పటికీ తెలియదు. అలాంటి మిశ్రమాల్లో మొదటి పదం functional గా adjective అవుతోందని వారు భ్రమిస్తున్నారు. ఆ మాటే తమ వ్యాకరణాల్లో రాసుకుంటున్నారు కూడా! రెండు పదాలు కలుస్తున్నప్పుడు మాయమౌతున్న విభక్తి ప్రత్యయాల (prepositions)ని వివరించే వైయాకరణ బాధ్యత (grammarian's burden)గురించి మర్చిపోతున్నారు.

సమాసాలే మన భాషక్కూడా బలం. ఇంగ్లీషు వ్యాకరణాల్లా కాకుండా మన వ్యాకరణం సమాసాల్ని క్రోడీకరించి వర్గీకరించింది కూడా. అవి మన భాషలో ఇప్పటికే వందలాదిగా ఉన్నాయి. కాని అవి సరిపోవు. మన భాషకున్న సమాస శక్తిని సక్రమంగా వినియోగించుకుని చాలా కొత్తపదాల్ని సృష్టించుకునే సౌలభ్యం ఉంది.

సందర్భాంతర ప్రయోగాలు

నామవాచకాల్ని క్రియాధాతువులు (programming, airing, parenting, shopping, modelling, typing, cashing, triggering, highlighting, focussing మొదలైనవి) గా మార్చి ప్రయోగించడం ఇంగ్లీషుకు ఎంత ఊపునిచ్చిందో ఇది కూడా అంతే ఊపు నిచ్చింది. సందర్భాంతర ప్రయోగాలంటే సాంప్రదాయికంగా ఒక సందర్భంలో మాత్రమే వాడాల్సిన పదాల్ని ఇంకొన్ని ఇతర సందర్భాలక్కూడా అనువర్తించి వాడ్డం.అలాగే ఒక రంగంలో వాడాల్సిన సాంకేతిక పదాల్ని ఇంకో రంగానికి ఆరోపించి వాడ్డం కూడా ! ఉదా :- screen (తెఱ) నాటకాలకూ సినిమాలకూ అన్వయించే మాట. దాన్ని IT లో కొన్ని రకాల పుటల్ని సూచించడానిక్కూడా వాడుతున్నారు.

అలాగే, campaign కి ప్రాథమికంగా దండయాత్ర అని అర్థం. కాని ఇప్పుడు దాన్ని ప్రచారయుద్ధం అనే అర్థంలో కూడా వాడుతున్నారు. గుఱ్ఱాల శారీరాన్ని(anatomy)అందులో భాగాల్నీ కార్లకూ, ఇతర యంత్రాలకూ అన్వయించి ప్రయోగించడం కూడా జరిగింది.

<< మార్గదర్శకాలు