గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/ఆదర్శసూత్రాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానానికీ వ్యవహారానికీ అవసరాలకీ అనుగుణంగా కొత్త తెలుగు పదాల్ని కల్పించుకునేటప్పుడు కొన్ని ఆదర్శ సూత్రాల్ని గమనంలో ఉంచుకోవాలి.

  1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిరుసమాసాలై ఉంటే మంచిది. పర్యాప్తమైన చిరుతనాన్ని (optimum smallness) నిర్వచించడం కష్టం. కాని స్థూలంగా (అ) తెలుగులిపిలో అయిదు అక్షరాలకి మించని పదాలూ (ఇ) ఒకవేళ అయిదు అక్షరాలకి మించినా, ఆరేడు అక్షరాలు కలిగి ఉన్నా, రెంటి కంటే ఎక్కువ అవయవాలు లేని సమాసాలూ చిఱువాడుకలు అని భావిచవచ్చు.
  2. సాఫీగా అర్థమయ్యే ఇంగ్లీషు పదాల (plain English terms)కి విశేషణాల (adjectives)తో కూడిన వర్ణనాత్మక పదజాలాన్ని సృష్టించడానికి పూనుకోకూడదు. అలాంటి ప్రయత్నం సాధారణంగా కొండవీటి చాంతాడంత సమాసాలకి దారితీస్తుంది. Loan translation (అంటే మూలభాషలోని అర్థాన్ని మనం భాషలోకి అనువదించి పదాలు కల్పించడం) కొన్నిసార్లు తప్పదు. కాని అన్ని వేళలా అదే మంత్రం గిట్టుబాటు కాదు. బ్లాగ్ లాంటి పదాల్ని "దాదాపుగా" అలాగే ఉంచి తత్సమాలుగా వాడుకోవడం మంచిది.
  3. తెలుక్కి స్వాభావికమైన జాతీయాన్ని నుడికారాన్ని (idiom) భ్రష్టుపట్టించకూడదు. తెలుగులో ఇమడని నిర్మాణాలు (structures)శీఘ్రంగా పరమపదిస్తాయని మఱువరాదు.
  4. భాషా పరిశుద్ధతని నిలబెట్టడం మన లక్ష్యం కాదు. భాషని సుసంపన్నం చెయ్యడం, ప్రయోగాత్మకతని ప్రోత్సహించడం మన లక్ష్యం. కాబట్టి వైరి సమాసాల్ని మిశ్రసమాసాల్ని విరివిగా అనుమతించాలి. అయితే అవి శ్రవణ సుభగంగా (వినసొంపుగా) ఉంటేనే పదికాలాల పాటు నిలుస్తాయి. వికారమైన కాంబినేషన్లది అల్పాయుర్దాయం. తప్పనిసరై దిగుమతి చేసుకున్న ఇంగ్లీషు పదాలకి సంస్కృత ప్రత్యయాల (suffixes)నీ, ఉపసర్గల (prefixes) నీ చేర్చి వాడుకోవడం అమోదయోగ్యమే. ఉదా : కర్బనీకరణ మొదలైనవి.
  5. ఇంగ్లీషులో లాగే తెలుగులో కూడా ప్రత్యాహారాల (abbreviations) ద్వారా ఏర్పడే acronyms ని (వెకిలిగా పరిగణించకుండా) వాటికి ఒక గౌరవనీయ స్థానాన్ని కల్పించడం చాలా అవసరం. తెలుగులో ఇప్పటికే అలాంటివి కొన్ని ఉన్నాయి.
    • ఉదా: అరసం (అభ్యుదయ రచయితల సంఘం), విరసం (విప్లవ రచయితల సంఘం), సికాస (సింగరేణి కార్మిక సమాఖ్య). వీటి సంఖ్య ఇంకా ఇంకా పెరగాలి. ముఖ్యంగా తెలుగు శాస్త్ర సాంకేతిక రంగాల్లో !
  6. మిశ్ర పద నిష్పాదన (hybrid coinage)ని ప్రోత్సహించాలి. అంటే, ఒక భాషకి చెందిన ఉపసర్గల్నీ ప్రత్యయాల్నీ ఇంకో భాషకి చెందిన దేశి పదాలకి చేర్చి కొత్త పదాలు పుట్టించడం. ఉదాహరణకి :- దురలవాటు. ఇందులో "దుర్" అనే ఉపసర్గ సంస్కృతం. "అలవాటు" తేట తెలుగు పదం. ఇలాంటివే నిస్సిగ్గు, ప్రతివాడు, అతి తిండి మొదలైనవి. ఇలాంటివి చాలా ఉన్నాయి కాని సరిపోవు. ఇవి వందలుగా వేలుగా పెరగాలి.
  7. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. పాత పదాలు, కావ్యభాష, గ్రాంధికం అంటూ కుహనా అభ్యూదయ లేబుళ్ళు వేసి మనం నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చిన అచ్చ తెలుగు పదజాలం అపారంగా ఉంది. అలాగే అలాంటి సంస్కృత పదజాలం కూడా విపరీతంగా ఉంది.

అభ్యూదయపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
పదాలన్నీ కావాలిప్పుడు
దాగేస్తే దాగని భాష (శ్రీ శ్రీకి క్షమాపణలతో)

ఆ పదజాలాన్నంతా ఇప్పుడు వెలికి తీయక తప్పదు. ఈ సందర్భంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కొన్ని దురభిప్రాయాల్ని కూడా సవరించాలి.

తెల్ల దేశాల్లో వారికి తెలిసిన plain language, layman's vocabulary అనే పదాలకి అర్థం వేరు. మన దేశంలో layman's language కి అర్థం వేరు. అక్కడి layman's language మన layman's language కంటే అత్యంత సంపన్నమైనది. శక్తిమంతమైనది కూడా. మన దేశంలో వాడుకలో ఉన్న layman's language ఒక చచ్చు భాష, బీద భాష కూడా. ఇందులో పదాలు కొద్ది. వ్యక్తీకరణలు పూజ్యం. మన laymen కనీసం ఐదో తరగతి వరకైనా చదివినవారు కాకపోవడం ఇందుకో కారణం. పదో తరగతి వరకు చదివిన వారిక్కూడా పుస్తక పఠనాసక్తి లేకపోవడం మరో కారణం. కాబట్టి అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త పదజాలాన్ని రూపొందించడానికి పూనుకోకూడదు. అలా పూనుకుంటే తెలిసిన పదాల గుడుగుడుగుంచంలోనే తిరగాల్సివస్తుంది.


<< మార్గదర్శకాలు