గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/తెలుగులో క్రియా కల్పన సాధనాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

ఏ భాషలోనైనా ప్రాథమిక క్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల (nouns)ని విశేషణాల్ని (adjectives) రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగుభాష అందిస్తున్న సౌకర్యాల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి.

 1. "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు
  • ఉదా: కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.
 2. అనుస్వార పూర్వకమైన (సున్నా ముందు గల)"చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.
  • ఉదా: దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.
 3. ద్విరుక్త (వత్తు) "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు
  • ఉదా: తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.
 4. "చు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.
  • ఉదా: నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి
 5. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు.
  • ఉదా: గురించు (addressing), ఆకళించు (explain), సవరించు (amend), సవదరించు (edit) మొదలైనవి.
 6. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియా ధాతువులు.
  • ఉదా: చేయించు ("చేయు" కు ప్రేరణార్థకం), కదిలించు ("కదులు" కు ప్రేరణార్థకం) మొదలైనవి.
 7. "ఇంచుక్" ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత)క్రియా ధాతువులు. (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి)
  • ఉదా: ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.
 8. "యు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు.
  • ఉదా: ఏయు, కాయు, కోయు, కూయు, డాయు, తీయు (తివియు), తోయు, మోయు, మ్రోయు, వేయు మొదలైనవి.
 9. "యు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు.
  • ఉదా: తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.
 10. "ను" తో అంతమయ్యే క్రియాధాతువులు.
  • ఉదా: తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.
 11. సామాన్య క్రియా ధాతువులు.
  • ఉదా: సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.
 12. విశేష క్రియా ధాతువులు (special verbs).
  • ఉదా: ఉండు, పోవు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు మొదలైనవి.

మరొక విషయం: తెలుగులో క్రియలు రెండు విధాలుగా ఉంటాయి. 1.సకర్మక క్రియలు (transitive verbs) 2. అకర్మక క్రియలు (intransitive verbs).

సూత్రం 1. సకర్మక క్రియలకు మాత్రమే చివర "ఇంచుక్" ప్రత్యయం వస్తుంది.

ఉదా: ధరించు: ఆయన కిరీటం ధరించాడు. (ఇక్కడ ధరించు అనే క్రియకు కిరీటం కర్మ కనుక ఇది కర్మ గలిగిన సకర్మక ధాతువు)

సూత్రం-2. అకర్మక క్రియలకు చివర "ఇల్లుక్" వస్తుంది. ఉదా: ఆమె హృదయేశ్వరిగా విరాజిల్లింది. (ఈ వాక్యానికి కర్మ లేదు కనుక "విరాజిల్లు" అకర్మక ధాతువు)

కాబట్టి మనం ఇంచుక్ బదులు ఇల్లుక్ చేర్చడం ద్వారా సకర్మక ధాతువుల్ని అకర్మక ధాతువులుగా మార్చడానికి తెలుగుభాష అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.

 • ఇంచుక్ = చేయు
 • ఇల్లుక్ = అగు

ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు:

 • సన్నగిల్లు - సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు)
 • పరిఢవించు - పరిఢవిల్లు
 • తొందఱించు - తొందఱిల్లు మొదలైనవి.

"ఇంచుక్, ఇల్లుక్" లని తెలివిగా పదాలకు చేర్చడం ద్వారా అంతులేనన్ని కొత్త క్రియాధాతువుల కల్పనకు తెలుగుభాష అవకాశమిస్తోంది. రెండూ ముఖ్యమైనవే. "ఇల్లుక్" చేర్పు తెలుగు నుడికారానికి స్వాభావికం కాని కర్మార్థక (passive voice) ప్రయోగాల ఆవశ్యకతని గణనీయంగా తగ్గిస్తుంది.

 1. (సవరిత వాడుక - modified usage):- ఆ వేగుతో అతను హెచ్చరిల్లాడు (హెచ్చరించబడ్డాడు- మేలుకున్నాడు. He got alert with the mail)
 2. (నిష్పన్న వాడుక - coined usage):- భవిష్యత్తులో వంద డాలర్ల లోపలే కంప్యూటర్లు అందుబాటిల్లుతాయి. (అందుబాటులోకి వస్తాయి-దొరుకుతాయి. Future PCS could be accessed/accessible at just $ 100)

ఇక్కడ కొన్ని నియమాలు ప్రవర్తిస్తాయి. మనం కల్పించే పదాల శ్రావ్యతని బట్టి వాటిని పాటించడమో మానుకోవడమో చెయ్యొచ్చు.

 1. ఉర్దూ పదాలకు "ఇంచుక్/ఇల్లుక్" చేర్చడానికి ముందు ఆ పదాల చివర "ఆయ్" చేరుతుంది.
  • ఉడ్ (ఎగరడం) - ఉడ్ + ఆయ్ = ఉడాయ్ + ఇంచుక్ = ఉడాయించు (to decamp)
  • బనా (తయారు చెయ్యడం) - బనా + య్ = బనాయ్ + ఇంచుక్ = బనాయించు (to frame a criminal charge)
 2. సంస్కృత పదాలకు ఇంచుక్ చేరే విధానం మనకందరికీ కొద్దో గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం చదవండి. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో కూడా అవసరమైన పదాల కల్పన జరగడంలేదు. దీనికి సామాజిక కారణాలున్నాయి. సంస్కృత భాషా పరిజ్ఞానం చాలావరకు బ్రాహ్మణులకే పరిమితమైనది. ప్రస్తుతం మన తెలుగు బ్రాహ్మణులకు తెలుగే సరిగా రాదు. సంస్కృతం సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితిలో వారు ఎవరికీ ఏమీ నేర్పే సావకాశం లేదు. మిగతావారికేమో సంస్కృతంతో సంపర్కం ఎప్పుడూ లేదు. We are apparently living in age of cultural disconnect with our history and past. ఏతావతా మనం ఇంగ్లీషు పదాలకు దీటైన దేశిపదాల్ని పట్టుకోవడంలో విఫలమౌతున్న దశాపరిణామం గోచరిస్తోంది. నేను కొంత ప్రదర్శిస్తాను. తరువాత ఎవరైనా ప్రయత్నించండి.
  • పుస్తకం (book) - పుస్తకించు (booking) వీణ్ణి జేబుదొంగగా పుస్తకించండి. (నమోదు చెయ్యండి. Book him as a pickpocket)
  • మార్గం (route) - మార్గించు (routing) పేపాల్ ద్వారా ఈ చెల్లింపుని మార్గించాను (మార్గం కల్పించాను) - పేపాల్ పద్ధతిలో (మార్గంలో) ఈ చెల్లింపుని పంపించాను. (I routed this payment through Paypal)
 3. "ఇంచుక్" ఉపయోగించి ప్రసిద్ధ సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు.అలాంటివి ఒకటిరెండు ఇప్పటికే సుప్రసిద్ధం. ఉదా: భీష్ముడు - భీష్మించుట, శివాలెత్తుట మొ. మఱికొన్నిటిక్కూడా అవకాశముంది. కాని అలాంటి క్రియాధాతువులు అర్థం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి.
  • విక్రమార్కించు = పట్టువదలకపోవు
  • జయచంద్రించు = విదేశీయులకు తోడ్పడు
  • కుంభకర్ణించు = లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.


<< మార్గదర్శకాలు