గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/వ్యతిరేకార్థకాల నిష్పాదన

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

ప్రతి భాషలోను "అవునా ?" అంటే "కాదు" అనడానికి, "ఉందా ?" అంటే "లేదు" అనడానికి కావల్సిన ప్రాథమిక పదసరంజామా తప్పకుండా ఉంటుంది. వీటిని వ్యతిరేకార్థకాలు (antonyms) అంటారు. ధ్రువీకారి వాక్యాల (affirmative sentences)కు వ్యతిరేకార్థక వాక్యాల (negative sentences)ని అందరూ కూర్చగలరు. కాని సానుకూల పదాల్ని (positive words)ని వ్యతిరేక పదాలు (negative words)గా మార్చడానికి కొంచెం అభ్యాసం కావాలి. భాషలో కొన్ని సానుకూల పదాలకు వ్యతిరేక పదాలు సహజసిద్ధంగానే లభ్యమౌతాయి. వెలుగు X చీకటి, మంచి X చెడు మొ. కానీ అన్నిటికీ ఇలా పూర్వాయత్తం(readymade)గా లభ్యం కావు. కనుక మనం చాలా పదాలకు ప్రయత్నపూర్వకంగా వ్యతిరేకార్థకాల్ని రూపొందించాల్సి ఉంటుంది.

అలా రూపొందించడానికి తెలుగుభాష అందిస్తున్న సాధనాలేమిటి ?

మనకు రెండు రకాల వ్యతిరేకార్థకాలు అవసరమౌతాయి. 1. కానిది 2. లేనిది.

ఉదా:-

 • అవిద్య = విద్య కానిది (అజ్ఞానం)
 • నిర్వివాదం = వివాదం లేనిది (సునిశ్చితం)

అయితే ఇవి సంస్కృత నిర్మాణాలు. కృత్రిమ వ్యతిరేకాల కల్పనకు అచ్చతెలుగుభాష అందిస్తున్న సౌకర్యాలు అతిస్వల్పం. "కానిది"అని చెప్పే పద్ధతే తెలుగులో లేదు. "కానిది" అని వాక్యరూపంగా చెపాల్సిందే తప్ప ఆ అర్థంలో-ఉన్న పదాలకు ఎలాంటి మార్పులూ చేర్పులూ చెయ్యడానికి తెలుగుభాష అవకాశమివ్వదు. "లేనిది"అని చెప్పే పద్ధతి మాత్రం ఉంది.

ఉదా:-

 1. సిగ్గు + ఇడి (ఇండి) = సిగ్గిడి/సిగ్గిండి = సిగ్గులేనివాడు/సిగ్గులేనిది
 2. వాలు + ఇండి (ఇండి) = వాలిండి = తోకలేని కోతి (apes/primates)
 3. ముక్కు + ఇది (ఇండి) = ముక్కిడి/ముక్కిండి = ముక్కు లేనివాడు/ముక్కులేనిది

కాని ఇదొక్కటే సరిపోదు. "ఇడి/ఇండి" ప్రత్యయాన్ని పునరుద్ధరించి ప్రచురపఱచడానికి సమయం తీసుకుంటుంది. కనుక అలవాటైన సంస్కృత ప్రత్యయాలతో ప్రస్తుతానికి పని గడుపుకోవాలి.

కానిది

సంస్కృతంలో "కానిది" అనే అర్థంలో పదానికి ముందు "అ" అనే ఉపసర్గ చేరుస్తారు.

 1. అ + జ్ఞానం - అజ్ఞానం = జ్ఞానం కానిది
 2. అ + సహనం = అసహనం = సహనం కానిది మొ.

దీని స్థానంలో ఇటీవల తెలుగు పాత్రికేయులు సంస్కృతంలో అరుదుగా ప్రయోగించబడే "ఇతర" అనే పదాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు.

 1. మత + ఇతర = మతేతర = మతం కంటే వేరైనది అని అసలు అర్థం (irreligious)
 2. రాజకీయ + ఇతర = రాజకీయేతర = రాజకీయాల కంటే భిన్నమైనది అని అసలు అర్థం (apolitical)
 3. వ్యవసాయ + ఇతర = వ్యవసాయేతర (సాగు కంటే వేరైనది - non-agro)

ఈ నిర్మాణాలకు అభ్యంతరం లేదు. కాని అన్ని చోట్లా ఇవే వాడ్డం వల్ల వ్యాకరణం అందించే సౌకర్యాల్ని వినియోగించుకోలేకపోతాం. ఉదాహరణకి ఇలాంటి నిర్మాణాలు సుదీర్ఘమైనవి. ఒక్క "అ"కారాన్ని పదం ముందు చేరిస్తే సరిపోయేదానికి "ఇతరం" అని పదాన్ని అనవసరంగా పొడిగించడం. తత్‌ఫలితంగా ఏర్పడిన నిర్మాణాల్ని వాటి ఇంగ్లీషు సమానార్థకాలతో పోల్చి చూడండి. అర్థమౌతుంది. ఇందులో ఇంకో అసౌకర్యం ఏమిటంటే-ఇది సామాన్యమానవుడి పరిజ్ఞానానికి అతీతమైనది. "ఇతర" అని చేర్చినప్పుడల్లా ముందుపదంతో సవర్ణదీర్ఘసంధో గుణసంధో యణాదేశసంధో చెయ్యాల్సి వస్తుంది. అంత దూరం పోలేక "కలిపికొట్టు కావేటి రంగా !"అనుకుని "యేతర" (హిందూ + యేతర) అంటూ భాషలో ఎక్కడా లేని/తర్కసహం కాని ఒక భ్రష్టరూపాన్ని సృష్టించి వాడుతున్నారు.

కనుక వ్యతిరేకార్థకంగా "అ"కారాన్ని విస్తృతంగా పునరుద్ధరించాల్సి ఉంది. "ఇతరాలు" అరుదుగా వాడాలి.

పదం అచ్చుతో మొదలైతే పదానికి ముందు "అ"కారం బదులు "అన్" వస్తుంది.

ఉదా : ఆచారం అన్ + ఆచారం = అనాచారం

లేనిది

లేనిది అనే అర్థంలో పదానికి ముందు "నిర్/నిస్" చేరుతుంది. కకార పకారాలతోను శ ష స లతోను మొదలయ్యే పదాల ముందు "నిస్" వస్తుంది.

ఉదా :-

 1. నిస్ + శేషం = నిశ్శేషం = శేషం లేనిది
 2. నిస్ + సారం = నిస్సారం = సారం లేనిది
 3. నిస్ + ఫలం = నిష్‌ఫలం = ఫలం లేనిది
 4. నిస్ + కారణం = నిష్కారణం = కారణం లేనిది

ఇతర ఉదాహరణలు :

 1. నిర్ + మొహమాటం = నిర్మొహమాటం = మొహమాటం లేకుండా
 2. నిర్ + లక్ష్యం - నిర్లక్ష్యం = లక్ష్యం లేకుండా
 3. నిర్ + వాసితం = నిర్వాసితం = వాసం (ఇల్లు) లేకుండా చెయ్యబడిన మొ.

మన పాత్రికేయులు ఇంత సౌకర్యవంతమైన ప్రత్యయాన్ని కూడా వదిలిపెట్టి "రహిత","హీన" మొదలైన పదాల్ని ఎంచుకుని అనవసరంగా, ఉచ్చరించలేనంతగా పదాల్ని పొడిగిస్తున్నారు. పైగా వారు చేసే పదనిర్మాణాల్లో ఇంకో అసౌకర్యమేంటంటే ఆ పదాల్లోంచి మనం క్రియల్ని కల్పించలేం. అదే, "నిర్" గనుక ఉపయోగిస్తే అనేక విశేషణాలతో పాటు క్రియల్ని కూడా నిష్పాదించగలం.

ఉదా:

 1. నిర్ + వోట్ + ఇంచు = నిర్వోటించు = వోటు లేకుండా చేయు (disenfranchise), అలాగే, (నిర్వాసితుడు లాగా)నిర్వోటితుడు = వోటు లేకుండా చెయ్యబడ్డవాడు (disenfranchisee)
 2. నిర్ + గుర్తించు = నిర్‌గుర్తించు (derecognize) మొ.<< మార్గదర్శకాలు